- కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లూ తీసుకోలేదు
- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 1.21 లక్షల ఇండ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2019–24 వరకు నాటి కేసీఆర్ సర్కార్ రాష్ట్రానికి ఒక్క ఇంటిని కూడా తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కోరిన దానికంటే ఎక్కువ ఇండ్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ ‘హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు భారీగా ఇండ్లను కేటాయించిందని తెలిపారు.
2024 తర్వాత ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా దాదాపు 79 వేల ఇండ్లను కేటాయించినట్లు వివరించారు. దీనికి తోడు అదనంగా ప్రస్తుతం 1.21 లక్షల ఇండ్లు కేటాయించడంతో తెలంగాణకు మొత్తం 2 లక్షల ఇండ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఏపీకి అదనంగా 2.25 లక్షల ఇండ్లు కేటాయించడంతో ఆ రాష్ట్రానికి మొత్తం 3 లక్షల ఇండ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 5 లక్షల ఇండ్లు కేటాయించినట్లు వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు ఇండ్లు కేటాయించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
మూడేండ్ల లక్ష్యం..
కొత్తగా కేటాయించిన ఇండ్లలో భూమి ఉన్న అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి, రాబోయే 2–3 ఏండ్లలో ఇండ్ల నిర్మాణాలను గరిష్ట స్థాయిలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు ‘ఆవాస్ ప్లస్’ యాప్, జియో ట్యాగింగ్, సెల్ఫ్ సర్వే వంటి విధానాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.
అర్హత నిబంధనలు సరళీకృతం..
అర్హత నిబంధనలను కూడా సరళీకరించినట్లు మంత్రి తెలిపారు. గతంలో రూ. 10 వేలుగా ఉన్న నెలవారీ ఆదాయ పరిమితిని రూ.15 వేలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. సాధారణంగా ప్రజల వద్ద ఉండే టూ వీలర్, రిఫ్రిజిరేటర్ వంటి వాటిని అనర్హత ప్రమాణాల నుంచి తొలగించామని చెప్పారు. దీంతో మరింత మంది అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి అవకాశం కలుగుతుందని తెలిపారు. గతంలో వివిధ కారణాలతో నిర్మాణం పూర్తి కాని ఇండ్లను కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
